Saturday, February 2, 2013

శ్రీ సాయి సత్ చరిత్రము తొమ్మిదవ అధ్యాయము

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

తొమ్మిదవ అధ్యాయము

బాబావద్ద సెలవు పుచ్చుకొనునప్పుడు వారి యాజ్ఞను పాలించవలెను. వారి యాజ్ఞకు వ్యతిరేకముగా నడచిన ఫలితములు; కొన్ని ఉదాహరణలు; భిక్ష, దాని యావశ్యకత; భక్తుల యనుభవములు.

షిరిడీ యాత్రయొక్క లక్షణములు

బాబా యాజ్ఞలేనిదే యెవరును షిరిడీ విడువ లేకుండిరి. బాబా యాజ్ఞకు వ్యతిరేకముగా పోయినచో ననుకొనని కష్టములు వచ్చుచుండెడివి. బాబా యాజ్ఞను పొందుటకు వారి వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా కొన్ని సలహాలు ఇచ్చుచుండెడివారు. ఈ సలహాప్రకారము నడచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదము లేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువ అట్టి యుదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను.

తాత్యాకోతే పాటీలు

ఒకనాడు టాంగాలో తాత్యా కోపర్ గాం సంతకు వెళ్ళుచుండెను. తొందరగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్ గాం సంతకు పోవుచుంటినని చెప్పెను. బాబా యిట్లనెను. "తొందర పడవద్దు. కొంచెమాగుము. సంత సంగతి యటుండనిమ్ము. పల్లెవిడిచి బయటకు పోవలదు." అతని యాతురతను జూచి "మాధవరావు దేశపాండేనయిన వెంట దీసికొని పొమ్మ"ని బాబా యాజ్ఞాపించెను. దీనిని లెక్క చేయక తాత్యా వెంటనే టాంగాను వదిలెను. రెండు గుర్రములలో నొకటి క్రొత్తది; మిక్కిలి చురుకైనది. అది రూ.300ల విలువ జేయును. సావుల్ బావి దాటిన వెంటనే అది వడిగా పరుగెత్తెను. కొంతదూరము పోయిన పిమ్మట కాలు బెణికి యది కూలబడెను. తాత్యాకు పెద్దదెబ్బ తగులలేదు. కాని తల్లి ప్రేమగల బాబా యాజ్ఞను జ్ఞప్తికి దెచ్చుకొనెను. ఇంకొకప్పుడు కోల్హారు గ్రామమునకు పోవునపుడు బాబా యాజ్ఞను వ్యతిరేకించి టాంగాలో పోయి ప్రమాదమును పొందెను.

ఐరోపాదేశపు పెద్దమనిషి

బొంబాయనుండి ఐరోపాదేశపు పెద్దమనిషి యొకడు షిరిడీ వచ్చెను, నానా సాహెబు చాందోర్కరు వద్దనుంచి తననుగూర్చి బాబాకు ఒక లేఖను తీసికొని యేదో ఉద్దేశముతో షిరిడీకి వచ్చెను. అతనికి ఒక గుడారములో సుఖమైన బస యేర్పరచిరి. అతడు బాబా పాదములకు నమస్కరించి వారిచేతిని ముద్దిడవలెనని మూడుసారులు మసీదులో ప్రవేశించ యత్నించెను. కాని బాబా అతనిని నిషేధించెను. క్రింద బహిరంగావరణములో కూర్చుండియే దర్శించవలెననిరి. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడీ విడువవలెనని నిశ్చయించెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కినవారు కూడ అట్లనే సలహా ఇచ్చిరి. వారి సలహాలకు వ్యతిరేకముగా అతడు టాంగాలో బయలుదేరెను. ప్రప్రథమమున గుర్రములు బాగుగనే పరుగెత్తినవి. సావుల్ బావి దాటిన వంటనే యొక త్రొక్కుడుబండి ఎదురు వచ్చెను. దానిని జూచి గుర్రములు బెదిరి త్వరగా పరుగిడ సాగెను. టాంగా తలక్రిందులయ్యెను. పెద్దమనిషి క్రిందబడి కొంత దూరము ఈడ్వబడెను. ఫలితముగా గాయములను బాగు చేసికొనుటకై కోపర్ గాం ఆసుపత్రిలో పడియుండెను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా యాజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురనియు బాబా యాజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా పొవుదురనియు జనులు గ్రహించిరి.

భిక్షయొక్క యావశ్యకత

బాబాయే భగవంతుడయినచో వారి భిక్షాటనముచే జీవితమంతయు గడుపనేల? యను సందియము చాలామందికి కలుగవచ్చును. ఈ ప్రశ్నకు రెండు దృక్కోణములతో సమాధానము చెప్పవచ్చును. (1) భిక్షాటనముచేసి, జీవించుట కెవరికి హక్కు కలదు? (2) పంచసూనములు, వానిని పోగొట్టుకొను మార్గమేది? యను ప్రశ్నలకు సమాధానము చెప్ప వచ్చును.

సంతానము, ధనము, కీర్తి సంపాదించుటయం దాపేక్ష వదలుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవింపవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటివద్ద వంట ప్రయత్నములు చేసికొని, తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు. సాయిబాబా గృహస్థుడు కాడు; వానప్రస్థుడు కూడ కాడు. వారస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యమునుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ జగత్తు వారి గృహమని వారి నమ్మకము. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడియున్నది. వారు పరబ్రహ్మస్వరూపులు. కాబట్టి వారికి భిక్షాటనము చేయు హక్కు సంపూర్ణముగా కలదు.

పంచసూనములు, వానిని తప్పించుకొను మార్గమును ఆలోచింతము. భోజనపదార్థములు తయారు చేయుటకు గృహస్థులు అయిదు పనులు తప్పక చేయవలెను. అవి యేవన, 1. దంచుట, రుబ్బుట 2. విసరుట 3. పాత్రలు తోముట, 4. ఇల్లు ఊడ్చుట తుడుచుట, 5. పొయ్యి యంటించుట. ఈ అయిదు పనులు చేయునప్పు డనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపము ననుభవించవలెను. ఈ పాపపరిహారమునకు మన శాస్త్రములు ఆరు మార్గములు ప్రబోధించుచున్నవి. 1. బ్రహ్మయజ్ఞము, 2. వేదాధ్యయనము, 3. పితృయజ్ఞము, 4. దేవయజ్ఞము, 5. భూతయజ్ఞము, 6. అతిథియజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును. మోక్షసాధనమునకు ఆత్మసాక్షాత్కారమున కివి తోడ్పడును. బాబా యింటింటికి వెళ్ళి భిక్ష యడుగుటచే, ఆయింటిలోనివారికి వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి దెచ్చుచుండెను. తమ ఇంటి గుమ్మము వద్దనే యింత గొప్ప సంగతి బాబా బోధించుటవలన షిరిడీ ప్రజలెంతటి ధన్యులు!

భక్తుల యనుభవములు

ఇంకొక సంతోషదాయకమగు సంగతి. శ్రీకృష్ణుడు భగవద్గీత (9అ. 26శ్లో.) యందిట్లు నుడివెను. శ్రద్ధాభక్తులతో ఎవరైన పత్రముగాని పుష్పముగాని ఫలముగాని లేదా నీరుగాని యర్పించినచో దానిని నేను గ్రహించెదను. తనభక్తు డేదైన సమర్పించినచో దానిని నేను గ్రహించెదను. తనభక్తు డేదైన సమర్పించవలెననుకొని మరచినచో అట్టివానికి బాబా జ్ఞాపకము చేసి, అయర్పితమును గ్రహించి యాశీర్వదించువారు. అట్టివి కొన్ని యీ క్రింద చెప్పిన యుదాహరణలు.

తర్ ఖడ్ కుటుంబము (తండ్రి, కొడుకు)

రామచంద్ర ఆత్మారామ్ పురఫ్ బాబాసాహెబు తర్ ఖడ్ యొకా నొకప్పుడు ప్రార్థనసమాజస్థుడైనను బాబాకు ప్రియభక్తుడు. వాని భార్యాపుత్రులు కూడ బాబాను మిగుల ప్రేమించుచుండిరి. తల్లితో కూడ కొడుకు షిరిడీకి పోయి యచ్చట వేసవిసెలవులు గడుపవలెనని నిర్ణయించిరి. కాని కొడు కిష్టపడలేదు. కారణ మేమన తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవాడగుటచే ఇంటివద్ద బాబాయెక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను. కాని తండ్రి, పూజను సక్రమముగా చేసెదనని వాగ్దానము చేయుటచే బయలుదేరెను. అందుచే శుక్రవారము రాత్రి తల్లి, కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి.

ఆ మరుసటిదినము శనివారమునాడు తండ్రియగు తర్ఖడ్ త్వరగా లేచి, స్నానముచేసి, పూజను ప్రారంభించుటకు పూర్వము బాబా పటమునకు సాష్టాంగనమస్కారము చేసి లాంఛనమువలె కాక కొడుకు చేయునట్లు పూజను సక్రమముగా నెరవేర్చెదనని ప్రార్ధించెను. ఆనాటి పూజను సమాప్తిచేసి నైవేద్యము నిమిత్తము కలకండను అర్పించెను. సమయమందు దానిని పంచిపెట్టెను.

ఆనాటి సాయంత్రము, మరుసటిదినము ఆదివారము పూజయంతయు సవ్యముగా జరిగెను. దానికి మరుసటిదినము సోమవారము కూడ చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజచేసియుండలేదు. పూజయంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారమునాడు పూజనెప్పటివలె సలిపి కచేరికి పోయెను. మధ్యాహ్నభోజనమునకు వచ్చినప్పుడు తినుటకు ప్రసాదము లేకుండెను. నౌకరును అడుగగా, ఆనాడు ప్రసాదమర్పించుట మరచుటచే లేదని బదులు చెప్పెను. ఈ సంగతి వినగనే సాష్టాంగనమస్కారము చేసి, బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందకు నిందించెను. ఈ సంగతులన్నిటిని షిరిడీలోనున్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుమనెను. ఇది బాంద్రాలో మంగళవారము 12 గంటలకు జరిగెను.

అదే సమయమందు మధ్యాహ్మహారతి ప్రారంభించుటకు సిద్ధముగా నున్నప్పుడు, బాబా యాత్మారాముని భార్యతో "తల్లీ! బాంద్రాలో మీ యింటికి ఏమయిన తినే ఉద్దేశముతో పోయినాను. తలుపు తాళమువేసియుండెను. ఏలాగుననో లోపల ప్రవేశించితిని. కాని తినుట కేమిలేక తిరిగి వచ్చితిని" అనెను.

అమెకు బాబా మాటలు బోధపడలేదు. కాని ప్రక్కనేయున్న కుమారుడు ఇంటివద్ద పూజలో నేమియో లోటుపాటు జరిగినదని గ్రహించి యింటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను. అందులకు బాబా నిరాకరించెను. కాని పూజను అక్కడనే చేయుమనెను. కొడుకు వెంటనే తండ్రికి షిరిడీలో జరిగినదాని నంతటిని వ్రాసెను. పూజను తగిన శ్రద్ధతో చేయుమని వేడుకొనెను.

ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమతమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యకరము కదా! 



ఆత్మారాముని భార్య

అత్మారాముని భార్యవిషయ మాలోచింతుము. ఆమె మూడు వస్తువులను నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకొనెను. 1. వంకాయ పెరుగు పచ్చడి, 2. వంకాయ వేపుడుకూర, 3. పేడా. బాబా వీనినెట్లు గ్రహించెనో చూచెదము.

బాంద్రా నివాసియగు రఘువీరభాస్కరపురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్దవంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతికిచ్చి యొక వంకాయతో పెరుగుపచ్చడిని రెండవదానితో వేపుడును చేసి బాబాకు వడ్డించుమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగుపచ్చడి చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసికొని వెళ్ళెను. బాబాకాపచ్చడి చాల రుచిగా నుండెను. కాన దాని నందరికి పంచిపెట్టెను. బాబా వంకాయ వేపుడు కూడ అప్పుడే కావలెననెను. ఈ సంగతి రాధాకృష్ణమాయికి తేలియపరచిరి. అది వంకాయల కాలము కాదు గనుక యామెకేమియు తోచకుండెను. వంకాయ లెట్లు సంపాదించుట యనునది ఆమెకు సమస్యయాయెను. వంకాయపచ్చడి తెచ్చిన దెవరని కనుగొనగా పురందరుని భార్యయని తెలియుటచే వంకాయవేపుడు గూడ ఆమెయే చేసిపెట్టవలెనని నిశ్చయించిరి. ఆప్పుడందరికి బాబా కోరిన వంకాయవేపుడుకు గల ప్రాముఖ్యము తెలిపినది. బాబా సర్వజ్ఞుడని యందరాశ్చర్యపడిరి.

1915 డిసెంబరులో గోవింద బలరామ్ మంకడ్ యనువాడు షిరిడీ పోయి తనతండ్రికి ఉత్తరక్రియలు చేయవలె ననుకొనెను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారామునివద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబాకొరకేమైన పంపవలె ననుకొనెను. ఇల్లంతయు వెదకెను. కాని యొక్క పేడా తప్ప యేమియు గన్పించలేదు. ఈ పేడా యప్పటికే బాబాకు నైవేద్యము పెట్టియుండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై యుండెను. కాని ఆమె బాబాయందున్న భక్తిప్రేమలచే యాపేడాను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మియుండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. పేడా తీసికొనివెళ్ళుట మరచెను. బాబా ఊరకుండెను. సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినపుడు కూడ పేడా తీసికొని పోవుట మరచెను. అప్పుడు బాబా యోపికపట్టక తనకొర కేమి తెచ్చినావని యడిగెను. ఏమియు తీసికొని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, "నీవు యింటివద్ద బయలుదేరునప్పుడు అత్మారాముని భార్య నాకొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా?" యని యడిగెను. కుర్రవాడదియంతయు జ్ఞప్తికిదెచ్చుకొని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరుగెత్తి పేడాను దెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మ్రింగెను. ఇవ్విధముగా ఆత్మారాముని భార్య యెక్క భక్తిని బాబా మెచ్చుకొనెను". నా భక్తులు నన్ను నమ్మినట్లు నేను వారిని చేరదీసెదను". అను గీతావక్యము (౪-౧౧ 4-11) నిరూపించెను.

బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట యెట్లు?

ఒకప్పుడు ఆత్మారుముని భార్య షిరిడీలో నొక ఇంటియందు దిగెను. మధ్యాహ్నభోజనము తయారయ్యెను. అందరికి వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క యొకటి వచ్చి మొఱుగుట ప్రారంభించెను. వెంటనే తర్ఖడ్ భార్యలేచి యొక రొట్టెముక్కను విసరెను. ఆకుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టెముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు పోగా బాబా యిట్లనెను". తల్లీ! నాకు కడుపునిండ గొంతువరకు భోజనము పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడు ఇట్లనే చెయుము. ఇది నీకు సద్గతి కలుగజేయును. ఈ మసీదులో గూర్చుండి నేనెన్నడసత్యమాడను. నాయందట్లే దయ యుంచుము. మొదట యాకలితో నున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకొనుము". ఇదంతయు ఆమెకు బోధపడలేదు. కావున ఆమె యిట్లు జవాబిచ్చెను. 'బాబా! నేను నీ కెట్లు భోజనము పెట్టగలను? నా భోజనముకొర కితరులపై ఆధారపడి యున్నాను. నేను వారికి డబ్బిచ్చిభోజనము చేయుచున్నాను.' అందులకు బాబా యిట్లు జవాబిచ్చెను". నీ విచ్చిన ప్రేమపూర్వకమైన యా రొట్టెముక్కను తిని యిప్పటికి త్రేనుపులు తీయుచున్నాను. నీ భోజనమునకుపూర్వ మేకుక్కను నీవు జూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒక్కటియే. అట్లనే, పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నియు నా యంశములే. నేనే వాని యాకారములో తిరుగుచున్నాను. ఎవరయితే జీవకోటిలో నన్ను జూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కాబట్టి నేనొకటి తక్కిన జీవరాశి యింకొకటి యను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము". ఈ యమృతతుల్యమగు మాటలు విని యామె మనస్సు కరగెను. ఆమె నేత్రములు కన్నీటితో నిండెను. గొంతు ఆర్చుకొనిపోయెను. ఆమె యానందమునకు అంతులేకుండెను.

నీతి

'భగవంతుని జీవులన్నిటియందు గనుము' అనునది యీ యధ్యాయములో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, గీత, భాగవతము మొదలగునవి యన్నియు భగవంతుని ప్రతిజీవియందు చూడుమని ప్రబోధించుచున్నవి. ఈ యధ్యాయము చివర చెప్పిన యుదాహరణమునను ఇతరానేకముల మూలమునను, సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధలను, ఆచరణరూపమున నెట్లుంచవలెనో యనుభవపూర్వకముగా నిర్థారణచేసి యున్నారు. ఈ విధముగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాంతములను భోధించు చక్కని గురువని మనము గ్రహించవలెను.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

No comments:

Post a Comment