Sunday, January 20, 2013

షిరిడీ దర్శించేవారికి సమాచారం




షిరిడీ వెళ్ళేముందు:
బయలుదేరే ముందు సచ్చరిత్ర వారం రోజులు పారాయణ చేయండి. శ్రథ్థగా చదవండి. సమయమంతా సాయి లీలలతోనూ, సాయి నామ స్మరణతోనూ గడపండి. షిరిడీ వెళ్ళినప్పుడు, మీరు చదివినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండండి.

షిరిడీ వెళ్ళేముందు తీసుకుని వెళ్ళవలసినవి::

1)
సాయి సచ్ఛరిత్ర 2) ఆరతుల పుస్తకం 3) సాయి వెలిగించిన థునిలో వేయడానికి రావి, మేడి, తులసి పుల్లలు, గంథపు చెక్క, సాంబ్రాణి, ఆవు నెయ్యి, నవ థాన్యాలు, తేనె, పీచుతో ఉన్న కొబ్బరికాయ, 4) సాయి వెలిగించిన దీపాలలోకి నూనె, 5) ఉదయం హారతి తరువాత బాబాకి మంగళ స్నానం చేయించే నీటిలో కలపడానికి పన్నీరు.

(
యివన్నీ కూడా సాథ్యమయినంత వరకు ప్రయాణానికి ముందే సేకరించి పెట్టుకుని కూడా తీసుకెడితే, మనం షిరిడీ వెళ్ళినప్పుడు వీటికోసం షాపుల వద్దకు వెళ్ళి కొనుక్కునే శ్రమ తప్పుతుంది, మనకి సమయం కూడా కలసి వస్తుంది)

షిరిడీ ప్రయాణంలో:

ప్రయాణంలో వీలయినంత యెక్కువ సమయం సాయి రూపాన్ని థ్యానిస్తూ,
సాయి నామస్మరణతో గడపాలి. సచ్చరిత్ర, లేక సాయి లీలల పుస్తకాలు చదువుకుంటూ ఉండాలి.

బాబా మొట్టమొదట అహ్మద్ నగర్ వచ్చారు. అక్కడ ఆలీ అనే మహాత్మునితో కొంతకాలం కలిసి ఉన్నారు. అందుచెత అహ్మద్ నగర్ మీదుగా బస్ లో వెళ్ళేవారు,
అది స్మరించి ఆ పుణ్యభూమికి నమస్కరించుకోవాలి.

సాయి షిరిడీ చేరేముందు రహతా గ్రామం వచ్చారు. తరువాత కూడా తరచు దౌలూసేఠ్ అనే భక్తుని చూడటానికి వస్తూండేవారు. సాయి బాబా ఈ గ్రామం నుంచే విత్తనాలు తెచ్చి ప్రస్తుతం సమాథి మందిరం ఉన్న ప్రదేశంలో పూలతోట మొలిపించారు. అందుచేత రహతా చేరగానే సాయికీ,
ఆ గ్రామానికి ఉన్న అనుబంథాన్ని స్మరించి ఆ భూమికి నమస్కరించుకోవాలి

షిరిడీ చేరగానే::

నా అనుమతి లేనిదే యెవరూ షిరిడీలో కాలు మోపలేరు అన్నారు బాబా. అనుచేత మనం షిరిడీలో కాలు మోపామంటే ఆయన మనలని రప్పించుకున్నారు. అందుచేత ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి.

షిరిడీ ప్రవేశమే సర్వ దుహ్ ఖ పరిహారము అన్నారు బాబా. అందుకని ఆయన దయవల్ల మన కష్టాలన్ని తీరతాయనే నమ్మకంతో ఉండాలి.

షిరిడీ చేరిన తరవాత మనము యెక్కడ నడచినా ఆ బాటలోని ప్రతి యిసుక రేణువూ 60
సంవత్సరాల సాయి సంచరించారని గుర్తుకు తెచ్చుకుని ఆయన పాద స్పర్శతో పవిత్రమైన ప్రదేశమని భావంతో ఉండాలి. బాబా సామాన్యంగా పాదరక్షలు థరించేవారు కాదు. అందుచేత మనం యెండ వేడిమి లేనప్పుడు పాద రక్షలు లేకుండా నడిస్తే మంచిది.

లెండి బాగ్ యెదురుగా ఉన్న భవనంలో (దీక్షిత్వాడా వెనుక భాగం) సంస్థాన్ వారి పుస్తకాల షాపు ఉంది. యిక్కడ బాబా ఫొటోలు,
సచ్చరిత్ర పుస్తకాలు అన్నీ దొరుకుతాయి. సచ్చరిత్ర ముందే కొనుక్కుని వుంచుకుని బాబాని దర్శించుకున్నప్పుడు అక్కడ పూజారిగారికి ఇస్తే బాబాకి తాకించి, గ్రంథాన్ని పవిత్రం చేసి యిస్తారు.

మందిరంలోని ఆవరణలో పెద్ద హాలు ఉంటుంది. ఇక్కడ సామూహికంగా సాయి సత్యనారాయణ పూజ జరిపిస్తారు. ఉదయం 6.00
నించి కౌటర్లో టిక్కట్టులు అమ్ముతారు.

సచ్చరిత్ర పారాయణ చేసుకొవడానికి పెద్ద హాలు కూడా ఉంది. ఇక్కడ అన్ని భాషల లో నూ సచ్చ్రిత్ర పుస్తకాలు ఉంటాయి.
ఇక్కడ అందరూ ప్రసాంతంగా కూర్చుని కాసేపు చదువుకుంటూ ఉంటారు.

గురుస్థాన్ చుట్టూ ప్రదక్షిణ చేసేముందు అందులొ అగరు వత్తులు కూడా వెలిగించి పెట్టండి. అక్కడ వేప ఆకులు దొరికితే వాటిని బాబా ప్రసాదంగా తినండి.

సమాథి మందిరంలో బాబా దివ్య మంగళ స్వరూపాన్ని తదేకంగా చూడండి. మీరు లైనులో ఉన్నప్పుడు మీ వంతు వచ్చేవరకు మెల్లగా కదులుతూ ఉండండి. ముందుకు వెళ్ళాలనే ఆరాటంతో ముందరున్నవారిని తోసుకుని వెళ్ళకండి. బాబా దృష్టి అందరి మీద ఉంటుందని గుర్తుంచుకోండి. మన ప్రవర్తనని బట్టే ఆయన అనుగ్రహం కూడా ఉంటుంది. మనం బాబా ని దగ్గిరుండి చూశామా లేదా అన్నది కాదు,
ఆయన అనుగ్రహం మనమీద ప్రసరించిందా లేదా అన్నదే ముఖ్యం. ఆయన అందరికీ అవకాసమిస్తారు. ఒకవేళ రద్దీలో మనకి తగిన అవకాశం రాక సరిగా చూడలేకపోయినా, బాబా అనుగ్రహం మనమీద తప్పకుండా ఉంటుంది. బాబా మరొకసారి నీ దర్శన భాగ్యం ఇవ్వు బాబా అని వేడుకోండి.

సమాథికి యెడమవైపునించి వెడితే,
బాబా గారి పాదాలు, కుడివైపునించి వెడితే బాబా గారి శిరస్సు భాగము ఉంటాయి.
దర్శించుకుని భక్తి భావంతో శిరసు వంచి నమస్కరించుకోండి.


ద్వారకా మాయిలో మీకిష్టమైనంత సేపు కూర్చుని సచ్చరిత్ర చదవండి.
 
బాబాని దర్శించుకునేముందు,
నైవేద్యానికి పాలకోవా, పూలదండలు, తీసుకుని వెళ్ళండి. కోవా బాబా కి తాకించి ప్రసాదంగా మనకి ఇస్తారు. బాబా కి కప్పడానికి శాలువా కూడా తీసుకుని వెళ్ళండి, బాబాకి తాకించి మరలా మనకి ఇస్తారు. ప్రతీ ఆదివారమునాడు మందిరం ఆవరణలో బాబా వారికి సమర్పించిన శాలువాలు, ఆయనని తుడవడానికి ఉపయోగించిన తువ్వాళ్ళు మొదలైనవై వేలం వేస్తారు. మనము పాటలో పాడుకుని కొనుక్కొవచ్చు. పక్కనే వారి షాపు కూడా ఉంది. అక్కడ కూడా కొనుక్కోవచ్చు.

మంగళ స్నానము::

కాకడ ఆరతి తర్వాత బాబా విగ్రహానికి మంగళ స్నానం చేయిస్తారు. తరువాత వేడి నీరు సిథ్థం చేస్తారు. మనం రోజ్ వాటర్ తీసుకుని వెడితే,
ఆ రోజ్ వాటర్ సీసా తీసుకుని ఆ నీటిలో కలుపుతారు. ఆయనకి స్నానం చేయించిన నీటిని బయటకు కుళాయి ద్వారా పంపుతారట. ఆ పవిత్రమైన తీర్థాన్ని మనం తల మీద చల్లుకుని సీసాలో కూడా నింపి యింటికి పట్టుకెళ్ళవచ్చు. యిక్కడే బాబాకి నైవేద్యం పెట్టిన వెన్న ప్రసాదం కూడా ఇస్తారట.

యిక లోపల ఆవరణలో బాబా వస్తు ప్రదర్శన శాల కూడా ఉంది. లోపలికి వెళ్ళగానె,
బాబా విగ్రహాన్ని ప్రతిష్టించకముందు సమాథి మీద ఉన్న బాబా చిత్రపటం ఉండేది. దీనిని శ్యామారావు జయకర్ అనే చిత్రకారుడు చిత్రించినది. ప్రదర్శన శాలలో బాబా గారు ఉన్నప్పుడు ఆయన ఉపయోగించిన వస్తువులన్ని చక్కగా చూడండి.

బాబా గారు స్నానం చేయడానికి ఉపయోగించిన రాయి,
వెండి గొడుగు, దీపాలు, వింజామర, మొఖమల్ కఫ్నీ, ఆయన వాడిన పాదరక్షలు, చావడి ఉత్సవంలో బాబా భుజాలమీద కప్పిన కోటు, యిత్తడి లోటాలు, చిలుము గొట్టాలు, అప్పటి గ్రామఫోను, తిరగలి, శ్యామ కర్ణకి చేసిన అలంకారాలు, బాబాకి సమర్పించిన రథము,, రాగి హండాలు, సటకా, బిక్షకు వాడిన డబ్బాలు, మొదలైనవన్ని చూడవచ్చు.

ద్వారకామాయి నుండి చావడికి వెళ్ళే దారిలో మారుతి ఆలయం ఉంది. గణపతి శని మహదేవ మందిరాలు,
మహాలక్ష్మీ మందిరము, విఠల్ మందిరము, కానిఫ్ మందిరము, నరసిమ్హ మందిరము, విరోబా మందిరము, మాలుబా మందిరము, ఖందోబా మందిరము వీటినన్నిటినీ దర్శించండి.

అప్పటి సాయి భక్తుల యిళ్ళు::

శ్యామా యిళ్ళు,
లక్ష్మీబాయి షిండే యిల్లు (యిది చావడికి యెదురుగా ఉన్న చిన్న వీథిలో కొంచెం దూరంలో ఉంది)
భక్త మహల్సాపతి యిల్లు. (యిది లక్ష్మీ బాయి షిండే యింటికి కొద్ది దూరంలో ఉంది)

బాబా రోజూ భిక్ష చేసిన ఐదు యిళ్ళు:

1)
సఖారాం షెలకే: యిది చావడికి చాలా దగ్గరలో ఉంది.

2)
వామన్ గోండ్కర్ : యిది చావడికి యెదురుగా సఖారాం యింటికి దగ్గరలో ఉంది.

3)
బయ్యాజీ అప్పకోతే పాటిల్: (సాయి కుటీర్) యిది చావడినించి తూర్పుదిశగా యెడమవైపు సందులో నరశిమ్హ లాడ్జి వెనకాల ఉంది.

4)
బాయజా బాయి కోతే పాటిల్ యిల్లు : యిది సాయి కుటీర్ పక్కనే ఉంది.

5)
నంద్ మార్వాడీ యిల్లు :యిది ద్వారకా మాయికి దగ్గరగానె ఉంది. ఈ యింటికి బాబా ఆఖరుగా బిక్షకు వెళ్ళేవారట.

(
ఇది ద్వారకా మాయి యెదురుగా పెద్ద ఫాన్సీ షాపు. షాపు బోర్డ్ మీద నంద్ మార్వాడీ యిల్లు అని తెలుగులో కూడా రాసి ఉండటం చూడవచ్చు)

యింకా చూడవలసిన ప్రదేశాలు:

1)
కోపర్గావ్ యిక్కడ బాబా మందిరం చూడవచ్చు. బహుశా 10 కిలోమీటర్లు దూరం అనుకుంటాను. బాబా తపోభూమిలో సాయిబాబా మందిరం, యితర దేవాలయాలు ఉన్నాయి.

2)
ఉపాసనీ బాబా ఆశ్రమం: షిరిడీకి ఆరు కిలోమీటర్ల దూరంలో సకోరీలో ఉంది.

3)
శ్రీ శివనేసన్ సమాథి : ఈయన కోయంబత్తూరుకు చెందినవారు. బాబా కృప ఈయన మీద యెంతో ఉంది. యిది సాయి ప్రసాదాలయం నించి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆటోలో వెళ్ళి రావచ్చు. తప్పక చూడవలసిన ప్రదేశం. చల్లగా ప్రసాంతంగా ఉంటుంది. (నేను వెళ్ళినప్పుడు చూశాను.)

4)
శని సింగణాపూర్: యిది షిరిడీకి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రముఖ శనీశ్వర ఆలయం ఉంది.

యిక్కడకు 7
కిలోమీటర్ల దూరంలో సోనయీలో జగదాంబ రేణుకా మాత మందిరం ఉంది.

తిరుగు ప్రయాణంలో :

షిరిడీలో మనం పొందిన అనుభూతిని,
పవిత్ర బావాలని చక్కగా మన మనసుల్లో పదిలపరుచుకోవాలి. మనం ప్రయాణం చేసినంత సేపూ షిరిడీ లో మన అనుభూతులని, మనం చూసిన ప్రదేశాల గొప్ప తనాన్ని నెమరు వేసుకుంటూ సాయి స్మరణతో యిల్లు చేరాలి. మనం షిరిడీ వెళ్ళేది విహార యాత్రకి కాదు అని తెలుసుకోవాలి.

బాబా ఆజ్ఞ లేనిదే యెవరూ షిరిడీలో అడుగు పెట్టలేరు. షిరిడీ యాత్ర మనం అనుకుంటే అయ్యేది కాదు. అందుచేత ఈ అనుభవాన్ని చక్కగా పదికాలాలపాటు మన మనసుల్లో స్థిరంగా గుర్తుండిపోయేలా యాత్ర చేయండి.మనం చేసిన యాత్ర సార్థకమవ్వాలి.

షిరిడీలో అంగ వికలురు,
సాథువులులాంటి వారికి ఒక్కరికైనా భోజనం పెట్టించాలి. పవిత్ర క్షేత్రాల్లో మనము చేసే ప్రతీ మంచి పనికి యెన్నో రెట్లు ఫలితం ఉంటుందని శాస్త్ర వాక్యం.

ద్వారకా మాయిలో కి మీరు ప్రవేశించగానే,
యెడమవైపునించి లైనులో వెడుతూ ఉంటే, యెడమవైపున చిన్న కొయ్య స్తంభం ఉంటుంది. ఇప్పుడు దాని చుట్టూ రక్షణ వలయంగా సన్నటి స్టీలు రాడ్లు బిగించారు. ఈ కొయ్య స్తంభానికి మోకాళ్ళు తగిలిస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. అక్కడినించి మెట్లు యెక్కి పైకి వెళ్ళగానె యెడమవైపున థుని ఉంటుంది. ఈ థుని బాబా గారు జీవించి ఉన్నఫ్ఫుడు వెలిగించిన థుని, ఇప్పటికీ అది వెలుగుతూనే ఉంది. థుని దగ్గరలో రాతిపీట ఉండేది. బాబా అప్పుడప్పుడు దీనిపై కూర్చుని స్నానం చేసేవారు. మసీదు నైఋతి మూలలో థునికి పక్కన ఒక మట్టికుండ వుంది. అందులోని నీరు తాగడానికి, ముఖం కడుక్కోవడానికి వాడేవారు. (యిదివరకు ఈ మట్టికుండలోనీరు భక్తులందరూ తాగడానికి వీలుగా ఉండేది. యిప్పుడు యెలా ఉందో తెలియదు. )

బాబా బిక్షకు వెళ్ళినప్పుడు,
తెచ్చిన పదార్థాలన్ని నీటికుండ పక్కనే వున్న కొళంబె (మట్టిపాత్ర) లో వేసి, మూత పెట్టేవారు కాదు. ఈ కొళంబే కూడా చూడవచ్చు. (కొళంబేలో కూడా నైవేద్యం పెట్టి ప్రసాదంగా తిరిగి తీసుకునేవారు.)

తరువాత అక్కడ పక్కనే మూల బాబా గోథుమలు విసరిన తిరగలి ఉంటుంది. తిరగలి పక్కనే అద్దాల బీరువాలో గోథుమల బస్తా ఉంటుంది. బాలాజి పాటిల్ నేవాస్కర్ సాయిని నిష్కల్మషంగా సేవించిన భక్తుడు. తనకు పండిన పంటనంతా బళ్ళమీద తెచ్చి బాబాకి సమర్పించేవాడు. తరువాత బాబా యెంత ఇస్తే అంత తీసుకునేవాడట. ఇందుకు గుర్తుగా వారి కుటుంబ సభ్యులు కూడా బాలాజీ వంశీకులు నేటికీ సమర్పించే గోథుమల బస్తా యిక్కడుంచుతారు. సంవత్సరానికొకసారి శ్రీరామనవమినాడు ఉదయం ఆ బస్తాలోని గోథుమలు ప్రసాదాలయానికి తీసుకువెళ్ళి,
పిండిచేసె, భక్తులకు ప్రసాదంగా పంచుతారు. మళ్ళీ ఆ స్థానంలో కొత్త గోథుమల బస్తా ఉంచుతారు. ఈ గోథుమలు సంవత్సరకాలం నిలవ ఉన్నాకూడా, యే జాగ్రత్తలూ తీసుకోకపోయినా పురుగు పట్టడం, చెడకపోవడం విసేషం.

మసీదులో పడమటి గూటిని నింబార్ అంటారు. నింబారుకు ముందుగా మశీదు పైకప్పు దూలాలకు రెండు కొక్కాలు కనిపిస్తాయి. ఈ కొక్కలకే బాబా కొయ్యబల్ల కట్టుకుని నిద్రించేవారు. నింబారు పక్కనే దీపస్తంభాలుంటాయి. తిరగలి ఉన్న మూల ఒక అలమారలో బాబా చిలిం గొట్టాలుంచేవారు. ప్రస్తుతం యివి ప్రదర్శన శాలలో ఉంచారు. ఇక మశీదు పైనుండి మెట్లు దిగిరాగానే హాలులో ఈశాన్యమూల సాయి ప్రతిష్టించిన తులసి బృదావనం ఉంటుంది. రేకుల షెడ్డులో మెట్లకెదురుగా తూర్పు పక్క గోడనానుకుని ఒక రాయి ఉంటుంది. సాయి తరచు మథ్యాహ్న సమయంలో దానిపై కూర్చునేవారు. ఆ రాతి వెనుక పెద్ద ఫ్రేముతో బ్లాక్ అండ్ వైట్లో బాబాగారి చిత్రపటం ఉంటుంది.

రాతిబండ పక్కనే దక్షిణంవైపున చిన్న పులి విగ్రహం ఉంటుంది. రాతి బండకు పక్కన ఉత్తరం పైపున గుఱ్ఱం ,
విగ్రహం ఉంటుంది.

ద్వారకామాయి హాలు మథ్యన నేలలో ఒక చిన్న పాలరాతి తాబేలు పలక ఉంటుంది. ఆరతి సమయంలో శ్యామకర్ణ యిక్కడే నిలబడేది.

మధ్యాహ్న ఆరతి తర్వాత,
లెండీ బాగుకి వెళ్ళేముందు, సాయంత్రంపూట బాబా మశీదు ముందుగల మట్టిగోడకి ఆనుకుని నిలబడి దారినపోయే గ్రామస్తులను కుశలప్రశ్నలు వేసి పలకరిస్తూఉండేవారు. ఇక్కడ చిన్నమందిరంలో సాయి పాదుకలని అమర్చారు. బాబా ముందుకు వంగి గోడమీద చేతులు ఆనించినచోట మరొక జత చిన్న పాదుకలని అమర్చారు.

మసీదులో దక్షిణం పక్కన గోడని ఆనుకుని సాయి స్వయంగా వంట చేసిన పొయ్యి ఉంటుంది. ఈ పొయ్యికి యెదురుగా 2.5
అడుగుల యెత్తు కఱ్ఱ గుంజ ఉంటుంది. వంట చేసెటప్పుడు బాబా దానికి ఆనుకునేవారు.

బాబా భక్తుడైన సాయ్ శరణ్ ఆనంద్ ఒకసారి తీవ్రమైన మోకాలి నొప్పితో బాథపడుతుంటే మోకాలుని ఆ కఱ్ఱ గుంజకి తాకించి తరువాత దానిచుట్టూ ప్రదక్షిణలు చెయ్యమని సాయి సలహా యిచ్చారు. అలా చేయగానే ఆయన కాలినొప్పి తగ్గింది. (మీరు ద్వారకా మాయిలో దీని ప్రత్యెకంగా చూసి ప్రదక్షిణలు చేయండి. చాలా మందికి ఈ కఱ్ఱ గురించి
, దాని విశిష్టత తెలీదు) 

చెక్కతో చేయబడిని చిన్న అగరుబత్తి స్టాండు ద్వారకామాయి ప్రవేశద్వారం దగ్గిర కుడివైపున ఉంటుంది.
సాయి మధ్యాహ్న ఆరతి అయిన తరువాత ఈ అరుగుమీద కూర్చుని భక్తులకు ఊదీ ప్రసాదించేవారట.

మశీదులో ప్రవేశించాక యెడమ పక్కన పైభాగంలో పెద్ద యిత్తడి గంట ఉంటుంది. యిది సాయి కాలమ్నించీ ఉంది. దీనిని రోజూ మూడుసార్లు ఉదయం,
మధ్యాహ్నం, రాత్రి మోగించేవారు. మశీదు పైన రెండు జండాలు కనిపిస్తాయి.

మసీదు తరువాత చావడి చూడండి. చావడిలో ఉత్తరం గోడకి ఆనుకొని పద్ద రంగుల చిత్రపటం ఉంటుంది. బాబా చావడిలో నిద్రించేముందు రోజు శేజ్ ఆరతి,
ఉదయం కాకడ ఆరతికి ఈ పటం ఉన్న చోటలోనే కూర్చొనేవారు. దీనిని గుజరాత్ లోని నౌసారి గ్రామానికి చిందిన అంబారాం అనే 18 సంవత్సరాలు యువకుడు చిత్రించాడు. చావడికి మథ్యలో కటకటాలుండి రెండు భాగాలుగా ఉంటుంది. బాబా తూర్పుభాగంలో నిద్రించేవారు. స్త్రీలు బాబాని యివతలనిండే దర్శించుకోవాలి, సాయి నిద్రించే ఆ భాగంలోకి వారికి ప్రవేశించడానికి అనుమతిలేదు. యిప్పటికీ ఆ ఆచారం అలా పాటిస్తూనే ఉన్నారు.

గురువారమునాడు చావడి ఉత్సవం చూడదగ్గది. షిరిడీలో మూడు రాత్రులు ఉండి నిద్ర చేయాలంటారు. అందుచేత మీరు షిరిడీ వెడితే మూడురోజులలో ఒకటి గురువారం వచ్చేలా చూసుకుని ప్రయాణం పెట్టుకోండి.

లెండీ బాగ్ ::
 

గురుస్థాన్ కి దగ్గరలో లెండీ బాగ్ ఉంది. సాయిబాబా కాలంలో అది చెట్ల తోపు. తరువాత లెండీ బాగ్ లో రకరకాల గులాబీలు,
తులసి, సబ్జా లాంటి మొక్కలతో అందంగా ఉండేది. ఇక్కడ బాబా ఉపయోగించిన బావి కూడా ఉంది. అది కూడా యెవరినయినా అడిగి దానిని కూడా దర్శించండి.

తరువాత,
మీరు నందా దీపం , ఔదుంబర వృక్షం, దత్తత్రేయ విగ్రహం ఇవన్ని దర్శించుకోండి. ఇక్కడ ఆవరణలొ దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు భక్తులు.

యింకా ఇక్కడ మందిరం ఆవరణలో బాబా భక్తుల సమాథులు కూడా ఉన్నాయి.

సమాథి మందిరంలో కూడా బాబా వారి దివ్య మంగళ స్వరూపాన్ని కూడా దర్శించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందండి. బాబా విగ్రహం తయారీ వెనుక గల కథని కూడా యింతకు ముందు బ్లాగులో పోస్ట్ చేయడం జరిగింది. దానిని కూడా యిప్పుడే మరలా ఒకసారి చదువుకోండి. మీకు విగ్రహాన్ని చూడగానే బాబా యొక్క ఆ అద్భుతమైన లీల మదిలో మెదులుతూ శరీరం పులకరించిపోతుంది.


షిరిడీలో ఉండటానికి వసతులు

యిప్పుడు షిరిడీలొ చాలా హోటల్స్,
లాడ్జీలు ఉన్నాయి.

సాయి సంస్థాన్ వారి భక్త నివీఅస్ ఉంది. ఇది సమాథి మందిరం నించి కిలోమీటరు దూరంలో రహతా వైపుగా మన్మాడ్ రోడ్డుమీద ఉంది. యిందులో రమారమి 500
దాకా గదులు ఉన్నాయి. వరుస క్రమంలో గదులు కేటాయిస్తారు. ఇక్కడనించి ఉచిత బస్ సౌకర్యం కూడా ఉంది. మందిరం వరకూ షేర్ ఆటో లు కూడా ఉంటాయి.

సంస్థాన్ వారి ప్రసాదాలయంలో భోజనం లభిస్తుంది. లెండీ బాగ్ కి పక్కన సంస్థాన్ కాంటీన్లో,
క్యూ కాంప్లెక్స్ లో కూడా, టీ, కాఫీ, పాలు దొరుకుతాయి.

భక్తులకు ఊదీ,
ప్రసాదాలు సమాథి మందిరం యెదురుగా ఉన్న కవుంటర్లో, ఆరతి తరవాత యిస్తారు. రాత్రి శేజ్ ఆరతి తరువాత ఇచ్చే సాయి ప్రసాదం చాలా మథురంగా ఉంటుంది.

భక్తులు సమర్పించిన వస్త్రాలు,
గురువారము, ఆదివారములలో ఉదయం 8 గంటలకి కాంటీన్ కి, దీక్షిత్వాడాకి మథ్యలో వేలం వేస్తారు.

భక్త నివాస్ కాంటీన్లో కూడా టిఫిన్,
భోజనం దొరుకుతుంది. యింకా మందిరానికి కొద్ది దూరంలోనే చాలా భోజన హోటల్స్ ఉన్నాయి.




మీ షిరిడీ యాత్ర ఫలప్రదం,
శుభప్రదం అవాలని, అయేలా చేయమని సాయిని మనసరా ప్రార్థిస్తున్నాను.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.

1 comment:

  1. మీ పోస్టు చాలా బాగుంది.ఇది చదువుతుంటె శిరిడిలో ఉన్నట్టు ఉంది...

    ReplyDelete