Thursday, January 31, 2013

శ్రీ సాయి సత్ చరిత్రము మొదటి అధ్యాయము


 సాయి సత్ చరిత్రము
మొదటి అధ్యాయము

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

మొదటి అధ్యాయము

గురు దేవతా స్తుతి – బాబా గోధుమలు పిండి విసిరిన కథ – దాని తత్త్వము. పూర్వసంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయిసత్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు.

ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి యీ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీసాయినాథుడే సాక్షాత్తూ శ్రీగణేశుడని చెప్పుచున్నారు.

పిమ్మట శ్రీసరస్వతీదేవిని స్మరించి యామె తననీ గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు, శ్రీసాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారనియు చెప్పుచున్నారు.

తదుపరి సృష్టిస్థితిలయ కారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్ధించి, శ్రీసాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు, వారు మనలను సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు.

తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి, వారు కొంకణదేశములో వెలసిరనియు, ఆభూమి పరశురాముడు సముద్రమునుండి సంపాదించినదనియు చెప్పుచు, వారి వంశ మూలపురుషుని స్తోత్రము చేసిరి.

అటుపిమ్మట వారి గోత్రఋషియగు భరద్వాజమునిని స్మరించెను. అంతేగాక, యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనకసనందనాదులు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వసిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైముని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మొ||న పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్ధనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారామ్, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడ ప్రార్థించెను.

తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనమునుండి పెంచి పెద్దచేసిన మేనత్తకు, తన జ్యేష్ఠసోదరునకు నమస్కరించెను.

అటుపైన పాఠకులకు నమస్కరించి, తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్ధించెను.

చివరగా తన గురువు, దత్తావతారమును అగు శ్రీసాయిబాబాకు నమస్కరించి, తాను వారిపై పూర్తిగా నాధారపడి యున్నానని చెప్పుచు, ఈ ప్రపంచము మిథ్యయనియు, బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు, నీ ప్రపంచములో నేయే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికిని నమస్కరించెను.

పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గలవారలు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట, హేమాడ్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను.

1910 సం|| తదుపరి యొకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులో నున్న శ్రీసాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి యాశ్చర్యపడితిని. బాబా ముఖప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనె పరచి, దానిపై తిరుగలి యుంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసికొని, కఫనీ (చొక్కా) చేతులు పైకి మడచి, పిడికెడు చొప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి. అది చూచి నాలో నేను, “ఈ గోధుమపిండిని బాబా యేమిచేయును? ఆయనెందుకు గోధుమలు విసరుచుండెను? వారు భిక్షాటనముచే జీవించువారే! వారికి గోధుమపిండితో నేమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే!” యని చింతించితిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడ నిట్లే యాశ్చర్యమగ్నులయిరి. కాని మాలోనెవరికి గూడ బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను. ఆబాలగోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి, వారే విసరుట ప్రారంభించిరి. వారు తిరుగలిపిడిని చేతపట్టుకొని, బాబా లీలలను పాడుచు విసరుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను. కాని, వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిఱునవ్వు నవ్విరి. విసరునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి. “బాబాకు ఇల్లుపిల్లలు లేరు. ఆస్తిపాస్తులు లేవు. వారిపై ఆధారపడినవారు, ఆయన పోషించవలసిన వారెవరును లేరు. వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసికొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమపిండితో నేమిపని? బాబా మిగుల దయార్ద్రహృదయుడగుటచే మనకీ పిండిని పంచిపెట్టును కాబోలు.” ఈ విధముగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసరుట ముగించి, పిండిని నాలుగు భాగములు చేసి యొక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసికొనుచుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు నిట్లనెను.

“ఓ వనితలారా! మీకు పిచ్చి పట్టినదా యేమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి? ఏ కారణముచేత పిండిని గొంపోవుటకు యత్నంచుచున్నారు? సరే, యిట్లు చేయుడు. పిండిని తీసికొనిపోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు.” అది విని యా వనిత లాశ్చర్యమగ్నలయిరి, సిగ్గుపడిరి, గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా యాజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి.

నేనిదంతయు జూచి, షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని. ఊరిలో కలరా జాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసరినవి గోధుమలు కావనియు, వారు కలరా జాడ్యమును విసరి ఊరికవతల పారద్రోలిరనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామములోని ప్రజలందరు ఆనందించిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గూడార్ధమును తెలిసికొన కుతూహలము కలిగెను. గోధుమపిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొకదానినెట్లు శాంతింపజేసెను? ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక యీ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలయునని నిశ్చయించుకొంటిని. ఈ లీలలను జూచి యిట్లు భావించుకొని హృదయానందపూరితుడనయితిని. ఈ ప్రకారముగా బాబా సత్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంధము నిర్విఘ్నముగను, జయప్రదముగను పూర్తియైనది.

తిరగలి విసురుట – దాని వేదాంత తత్త్వము

తిరుగలి విసరుటను గూర్చి షిరిడీ ప్రజలనుకొనురీతియే కాక దానిలో వేదాంత భావము కూడ కలదు. సాయిబాబా షిరిడీ యందు షుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసరుచునే యుండురి! నిత్యము వారు విసరునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ; మీదిరాయి భక్తి; చేతిలో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని, ఆత్మసాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచి వేయవలయును. అటుపిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలయును.

ఇది వినగనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ యొకతె తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను. దానిని చూచి కబీరు యేడ్వసాగెను. నిపతినిరంజనుడను యొక సాధుపుంగవుడది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను: “నేను కూడ ఆ ధాన్యమువలె ప్రపంచమను తిరుగలిలో విసరబడెదను కదా?” దానికి నిపతినిరంజనుడిట్లు బదులు చెప్పెను:

“భయములేదు! తిరుగలిపిడిని గట్టిగా పట్టుకొనుము. అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము. దూరముగా పోనీయకుము. అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిమ్ము. నీవు తప్పక రక్షింపబడెదవు.”

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
మొదటి అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

No comments:

Post a Comment